: నరేంద్ర మోదీ స్వస్థలం వాద్ నగర్... 1800 సంవత్సరాలకు ముందు ఎలా ఉండేదో తెలుసా?
నరేంద్ర మోదీ స్వస్థలం గుజరాత్ లోని వాద్ నగర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఉన్న వాద్ నగర్ 1800 సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ఆనాడు ఈ ప్రాంతం పేరు ఆనందపూర్ అని, భారత పురావస్తు శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర అంశాన్ని రుజువులతో సహా కళ్ల ముందుంచారు. వాద్ నగర్ శతాబ్దాలకు పూర్వమే ఏర్పడిన నగరమంటూ తొలి శిలాశాసన సాక్ష్యాన్ని సంపాదించామని ఏఎస్ఐ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) సూపరింటెండెంట్ డాక్టర్ అభిజిత్ అంబేద్కర్ తెలిపారు.
బ్రాహ్మీ లిపిలో 2 లేదా 3వ శతాబ్దంలో రాసిన శిలాశాసనంలోని వివరాల ఆధారంగా, ఆనందపూర్ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడని, ఆయన పేరిటే ఆనందపుర రాజ్యం ఏర్పడిందని, అదే కాలక్రమేణా వాద్ నగర్ గా మారిందని అన్నారు. 7వ శతాబ్దంలో చైనా పర్యాటకుడు హ్యుయన్ సాంగ్ సైతం ఆనందపురం గురించి, ఇక్కడి వైభవాన్ని గురించి ప్రస్తావించారని తెలిపారు. దాదాపు 1000 సంవత్సరాల పాటు ఆనందపురం సకల సౌభాగ్యాలతో విలసిల్లిందని వెల్లడించారు. దీని గురించిన ప్రస్తావన అర్జున్ బారీ ప్రాంతంలో లభించిన కుమార్ పాల్ శాసనాల్లోనూ ఉందని అన్నారు.