: నేను ఇచ్చేంత తక్కువ ధరకు బంగారు ఆభరణాలను ఎవరూ ఇవ్వలేరు... చెక్ చేసుకోండి: లలితా జ్యూయలర్స్ ఎండీ


బంగారం ఆభరణాలను తాము ఇచ్చేంత తక్కువ ధరకు మరెవరూ ఇవ్వలేరని లలితా జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల షోరూముల్లో ఒకటిగా నిలిచేలా లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన లలితా జ్యూయలర్స్ 15వ బ్రాంచిని, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్, సోమాజిగూడలో ఈ శాఖ పలువురు సెలబ్రిటీలు, వీఐపీల సందడి నడుమ కొద్దిసేపటి క్రితం ప్రారంభం కాగా, ఆపై కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తమ వద్ద 100 శాతం తరుగు లేకుండా ఆభరణాలు లభిస్తాయని హామీ ఇచ్చారు.

తామిచ్చే ఎస్టిమేషన్ ప్రింట్ తీసుకుని, బయటి షోరూముల్లో ఎంక్వయిరీ చేసుకుని మరీ ఎక్కడ తక్కువ ధరైతే అక్కడే కొనుగోలు చేయాలన్నది తన సలహాగా ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని తాను వ్యాపార ప్రకటనల్లో సైతం చెబుతుంటానని గుర్తు చేసిన ఆయన, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముకు పూర్తి విలువను అందించాలన్నదే తన ఆశయమని తెలిపారు. త్వరలోనే కూకట్ పల్లిలోనూ తమ షోరూమ్ ప్రారంభమవుతుందని, రెండు నెలల్లో ఇది మొదలవుతుందని తెలిపారు.

 మార్చిలోగా విజయవాడలోనూ కాలుమోపనున్నామని వెల్లడించారు. కొత్త షోరూమ్ కోసం రూ. 750 కోట్లను పెట్టుబడిగా పెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయిని నర్సింహారెడ్డి, టీ సుబ్బరామిరెడ్డి సహా పలువురు వీఐపీలు, ప్రజా ప్రతినిధులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సాలీనా రూ. 50 వేల కోట్ల టర్నోవర్ తమ లక్ష్యమని, ఇకపై 22 శాతం తరుగు అన్న మాట వినిపించకుండా చేస్తానని అన్నారు. 

  • Loading...

More Telugu News