: డేరా బాబా విషయంలో రేపేంటి?... ఎన్నడూ లేనంత టెన్షన్ తో మోదీ సర్కారు!


నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత శాంతి భద్రతల పరంగా తొలి అతిపెద్ద సవాలు రేపు ఎదురుకానుంది. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించిన డేరా సచ్ఛా సౌదా (డీఎస్‌ఎస్‌) నేత గుర్మీత్ ను అత్యాచార కేసులో దోషిగా నిర్ధారించిన పంజాబ్, హర్యానా హైకోర్టు, రేపు శిక్షను ఖరారు చేయనున్న నేపథ్యంలో మోదీ సర్కారు చాలా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. గుర్మీత్ కు శిక్ష ఖరారైతే, తీవ్ర హింస చెలరేగవచ్చని అంచనా వేస్తున్న కేంద్రం, ఇప్పటికే పంచకుల, సిర్సా తదితర ప్రాంతాలతో పాటు పంజాబ్, హర్యానా రాష్టాలు, నోయిడా, ఢిల్లీ శివార్లలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది.

అయినప్పటికీ, ఆయన అభిమానులు రెచ్చిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్రం భయపడుతోంది. ఈ రెండు రాష్టాలతో పాటు మిగతా ప్రాంతాల్లో 900కు పైగా డేరాలు (హిందూ ఆశ్రమాలుగా పనిచేసే ఆధ్యాత్మిక కేంద్రాలు) ఉండగా, డేరా రాధాస్వామి సత్సంగ్‌ తోపాటు డీఎస్‌ఎస్, డేరా నూర్మహల్, డేరా సచ్‌ఖండ్‌ బలాన్, డేరా నిరంకారీ, డేరా నాంధారీలు అత్యంత సున్నితమైన ప్రాంతాలని కేంద్రం గుర్తించింది. జరుగుతున్న నష్టానికి డేరా సచ్చా సౌధా నుంచి పరిహారం వసూలు చేయాలని కోర్టు ఆదేశించినా, అదేమంత సులువైన విషయం కాదన్నది ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా.

ఒకవేళ తమ ఆరాధ్యదైవం జైలుకే పరిమితమన్న తీర్పు వెలువడితే గుర్మీత్ అనుచరులు, భక్తులు విధ్వంసాలకు దిగవచ్చని, దీంతో పెను ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో, రేపు తీర్పిచ్చే సమయానికి అన్ని సమస్యాత్మక ప్రాంతాలనూ తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో కేంద్రం భారీ ఎత్తున భద్రతా బలగాలను ఇప్పటికే రంగంలోకి దించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎదుర్కోగలమని పోలీసులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఏం జరుగుతుందోనన్న భయం సర్వత్రా నెలకొని ఉంది.

  • Loading...

More Telugu News