: సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద్దనుకున్నాడు.. వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు!
రైతు తన పని తాను చేసుకోవడం ద్వారా దేశానికి అన్నం పెడుతూ దేశ సేవ కూడా చేస్తుంటాడన్న భావన ఆయనకు బాగా నచ్చింది. అందుకే, సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏసీ గదుల్లో కూర్చుని పనిచేయాల్సిన ఆ ఇంజినీర్, ఆ ఉద్యోగం వద్దనుకుని వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఆటోమొబైల్ ఇంజినీర్ ప్రమోద్ అనే వ్యక్తి వ్యవసాయంలో విభిన్న పద్ధతులను అవలంబిస్తూ అధిక లాభాలను గడిస్తున్నాడు.
రైతు బిడ్డగా పుట్టిన ఆయన ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందినప్పటికీ, వ్యవసాయం చేయాలనే కోరిక మొదటి నుంచీ ఉండేది. అయితే, తల్లిదండ్రులు వారించడంతో ఉద్యోగంలో చేరాడు. కానీ, ఆ ఉద్యోగం నచ్చకపోవడంతో 2006లో ఇంటికి తిరిగి వచ్చి 26 ఎకరాల్లో వ్యవసాయం ప్రారంభించాడు. మొదట నష్టాలను చవిచూశాడు. ఊర్లో వారంతా ఆయనను తెలివితక్కువగా ఆలోచిస్తున్నాడని అనుకున్నారు. అయితే, వ్యవసాయం మీదే దృష్టిపెట్టి నూతన విధానాలను అవలంబించాడు.
26 ఎకరాల్లో వేరుశెనగ, కంది తదితర పంటలను పండించి, ఈ సారి విజయం సాధించాడు. ‘వందన’ అనే బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను స్వయంగా పట్టణానికి తీసుకెళ్లి విక్రయించాడు. దీంతో లాభాల పంట పండింది. ఇక నారింజ, నిమ్మ, బత్తాయి, అరటి లాంటి పండ్ల తోటలను పెంచాడు. అనంతరం వాణిజ్య పంటలు, పప్పుదినుసులు, పళ్లతోటలు పెంచాడు. ఇప్పుడు ఆయన ఏడాదికి రూ. కోటికి పైగా సంపాదిస్తున్నాడు. ఆయనను చూసి అక్కడి రైతులు స్ఫూర్తి పొంది ఆయన అవలంబిస్తోన్న విధానాలనే పాటిస్తున్నారు.