: పాడుతూ పరుగులు తీసే కెప్టెన్
బంతిని బలంగా మోదడంలో పోటీ పెడితే భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి దరిదాపుల్లో ఎవరూ నిలవరేమో! ఒత్తిడిని తరిమేయడంలోనూ అతనికి అతనే సాటి. మైదానంలో అడుగుపెట్టే వేళ ఎలా ఉంటాడో, మైదానం వీడి వెలుపలకు వచ్చే వేళ కూడా అలానే ఉంటాడు. గెలిచినా పొంగిపోడు. ఓటమిని సైతం సానుకూల ధోరణితో స్వీకరిస్తాడు. ఇక బ్యాటింగ్ చేసే సమయంలో టెన్షన్ల బారిన పడకుండా ఉండేందుకు ధోనీ పాటించే చిట్కా ఏంటో తెలుసా..? ఎంచక్కా మనసుకు నచ్చిన పాటలు పాడుకుంటూ బంతులు ఎదుర్కొంటాడట. బౌలర్ బంతిని విసిరేందుకు పరుగెత్తే సమయంలోనూ ధోనీ నోటివెంబడి కూనిరాగాలు వస్తాయట. ఆ లక్షణమే తనకి ఆటపై దృష్టి నిలిపేలా చేస్తుందన్నది ధోనీ మాట.
ఈ విషయాలన్నీ కూడా ప్రఖ్యాత స్పోర్ట్స్ సైకాలజిస్ట్ రూడీ వెబ్ స్టర్ రాసిన 'థింక్ లైక్ ఏ చాంపియన్' పుస్తకంలోనివి. కరీబియన్ దీవులకు చెందిన వెబ్ స్టర్ 2006-07 సీజన్లో భారత జట్టుకు మానసిక నిపుణుడిగా సేవలందించారు. తన పుస్తకంలో ధోనీ చెప్పిన పలు విషయాలను పొందు పరిచారు వెబ్ స్టర్. బంతిని ఎదుర్కొనే సమయంలో కూని రాగాలు తీయడం ద్వారా అవాంఛనీయ ఆలోచనలు దరిచేరవని ధోనీ చెప్పినట్టు వెబ్ స్టర్ తన పుస్తకంలో పేర్కొన్నారు.