: తాజ్‌మహల్ శివాలయం కానే కాదు... ఆగ్రా కోర్టుకు స్పష్టం చేసిన ఆర్కియాలజీ విభాగం!
ఆగ్రాలోని తాజ్‌మహల్ ఒకప్పుడు తేజోమహాలయం అనే శివుని దేవాలయం అని వస్తున్న ఆరోపణలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఖండించింది. తాజ్‌మహల్ దేవాలయం కానే కాదని ఆగ్రా కోర్టుకు స్పష్టం చేసింది. పీఎన్ ఓక్ రాసిన `తాజ్‌మహల్: ది ట్రూ స్టోరీ` పుస్తకం కారణంగా ఈ వివాదం మొదలైంది. రాజా జైసింగ్ `తేజోమహాలయం` అనే శివాలయాన్ని నిర్మించి షాజహాన్‌కి బహుమతిగా ఇచ్చాడని, దాన్నే ఆయన తాజ్‌మహల్ గా మార్చాడని ఆ పుస్తకంలో ఉంది.
దీనిపై ప్రభుత్వం, ఆర్కియాలజీ విభాగాలు స్పష్టతనివ్వాలని కోరుతూ లక్నోకు చెందిన హరి శంకర్ జైన్ ఆగ్రా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్‌కు సమాధానంగా తాజ్‌మహల్ షాజహాన్ నిర్మించాడని, ఆ స్థానంలో ఎలాంటి దేవాలయాలు ఉన్న జాడ కనిపించడం లేదని ఆర్కియాలజీ విభాగం కోర్టుకు వివరించింది. దీనిపై హరి శంకర్ తరఫు లాయర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాలపై తిరిగి సెప్టెంబర్ 11న విచారణ జరగనుంది.