: టీటీవీ దినకరన్‌కు పెరుగుతున్న మద్దతు... ఆందోళనలో పళని సామి, పన్నీర్ సెల్వం
అన్నాడీఎంకే వర్గాలు కలిసిన నాటి నుంచి తమిళనాడు రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. విలీనంపై అసంతృప్తిగా ఉన్న కొంతమంది పళని సామి వర్గ ఎమ్మెల్యేలు రోజుకొకరు వదిలి టీటీవీ దినకరన్‌కు మద్దతు పలుకుతున్నారు. ఇటీవల మరో ఎమ్మెల్యే దినకరన్ వైపుకు వెళ్లడంతో ముఖ్యమంత్రి పళని సామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు.
మరోపక్క విరుతచలం నియోజక వర్గం శాసన సభ్యుడు కలైసెల్వం శనివారం చెన్నైలోని టీటీవీ దినకరన్ ఇంటికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఇటీవల మళ్లీ పార్టీలోకి వచ్చిన పన్నీర్ సెల్వంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అది సహించలేక దినకరన్‌కు మద్దతిస్తున్నట్లు కలైసెల్వం పేర్కొన్నారు. తన లాగే ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి చర్యల వల్ల అసంతృప్తికి లోనవుతున్నారని, వారు కూడా త్వరలోనే దినకరన్‌కు మద్దతివ్వడానికి ముందుకు వస్తారని ఆయన అన్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి పళని సామి వర్గం శతవిధాలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.