: రాజ్యసభకు పునర్వైభవం తెస్తా.. పెద్దల సభగా మారుస్తా: వెంకయ్యనాయడు
చిన్న తనం నుంచి తనకు పట్టుదల ఎక్కువని... ఏదైనా అనుకుంటే సాధించేదాకా విశ్రమించలేదని... మనసు, శరీరాన్ని వంచి పని చేసేవాడినని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందరి అభిమానంతో దేశంలోనే రెండో అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతి పదవి తనకు దక్కడం, తాను చేసుకున్న అదృష్టమని తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్ గా సభకు పూర్వ వైభవం తీసుకొస్తానని... పెద్దల సభగా మారుస్తానని చెప్పారు. అమరావతిలో ఆయనకు ఈరోజు పౌరసన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటులో దేశ భవిష్యత్తును మార్చేలా అర్థవంతమైన చర్చలు జరగాలని, అవినీతిని అంతమొందించేలా చట్టాలు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ఆవేదన దేశానికి మంచిది కాదని, ఇది ప్రజాస్వామ్యానికి, చట్ట సభలకు మంచిది కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా కూలిపోయే అవకాశం ఉందని, ఈ పరిస్థితి తలెత్తకుండా కాపాడాల్సిన బాధ్యత చట్ట సభలపై ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ రాజకీయ విరోధులే కాని, శత్రువులు కాదని... అందుకే, విమర్శలు చేసుకునేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు తమను ప్రశ్నిస్తారని, ప్రజల్లో తాము చులకన అవుతామనే భయం ప్రజాప్రతినిధుల్లో ఉండాలని చెప్పారు.