: విభజన సమయంలో ఏపీ పక్షాన నిలబడ్డ ఏకైక వ్యక్తి వెంకయ్య నాయుడు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పక్షాన నిలబడిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వెలగపూడిలో జరుగుతున్న పౌరసన్మాన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ రావడానికి ఆయన కృషే కారణమని, మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందురోజే రాష్ట్రానికి ఇళ్లు జారీ అవడానికి సంతకం చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. అవే ఇళ్లకు ఇప్పుడు వెంకయ్య చేతుల మీదుగా శంకుస్థాపన చేయించినట్లుగా ఆయన తెలియజేశారు. స్మార్ట్ సిటీకి వెంకయ్య నూతన నిర్వచనం ఇచ్చారని, స్వచ్ఛ భారత్ పేరుతో అవార్డులిచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని, రియల్ ఎస్టేట్ కోసం ఓ కమిషన్ వేసి, మూడేళ్లలో దేశం మర్చిపోలేని విధంగా పట్టణాలను అభివృద్ధి చేశారని చంద్రబాబు కొనియాడారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ -`ఇవాళ రాష్ట్ర ప్రజలు వెంకయ్యనాయుడికి గొప్పగా స్వాగతం పలికారు. విద్యార్థులు, మహిళలు అందరూ మానవహారం ఏర్పాటు చేసి, జెండా పట్టుకుని నవ్వుతూ స్వాగతం చెప్పారు. ఇదంతా ఆయన మీద ఉండే గౌరవం వల్లే సాధ్యమైంది. ఆయన ఏ స్థానంలో ఉన్నా ఆ పదవికి వన్నె తీసుకువస్తారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, తిరుగులేని శక్తిగా ఎదిగిన వ్యక్తి వెంకయ్య. ఆయన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి` అన్నారు.
అలాగే వెంకయ్య వాగ్ధాటికి అచంచల విశ్వాసమే కారణమని, ఉత్తర భారత నేతలకు పోటీగా హిందీ మాట్లాడే ఏకైక దక్షిణ భారత వ్యక్తి వెంకయ్య అని, నమ్మిన సిద్ధాంతాలను ఆయన ఉల్లంఘించిన దాఖలాలు లేవని సీఎం అన్నారు. తాను వెంకయ్య నాయుడుతో సమావేశాలంటే భయపడేవాడినని, ఆయన సమయపాలనే అందుకు కారణమని వెల్లడించారు. అంతేకాకుండా వెంకయ్యనాయుడు అనునిత్యం ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తారని అన్నారు. ఉపరాష్ట్రపతి అవడం వల్ల ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పెద్దదిక్కును కోల్పోయిందన్న బాధ కూడా ఒకింత ఉందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో కూడా వెంకయ్య ఆశీస్సులు రాష్ట్రంపై ఉంటాయని ఆశిస్తున్నట్లు, భావి తరాలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, వెంకయ్య నాయుడిని గౌరవించే అవకాశం రావడం మన అదృష్టమని ముఖ్యమంత్రి అన్నారు.