: హర్యానాలో చెలరేగుతున్న హింస.. ఇప్పటివరకు 28 మంది మృతి
అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ నేరం రుజువైన విషయం తెలిసిందే. ఆయన దోషి అని హర్యానాలోని పంచకుల సీబీఐ కోర్టు ప్రకటించిన వెంటనే పోలీసులు ఆయనను సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని పంచకులలో చెలరేగుతున్న హింసలో మృతుల సంఖ్య 28కి చేరింది. మరో 250 మందికి గాయాలయ్యాయి. ఈ ఆందోళన రాజస్థాన్‌కి కూడా పాకింది.
ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు, భద్రతా బలగాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌తో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో వాహనాలకు, రైల్వే స్టేషన్లకు నిప్పు పెడుతూ గుర్మీత్ బాబా అనుచరులు రెచ్చిపోతున్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు.