: పనిని అవకాశంగా మార్చుకుని, ప్రభుత్వపాలనలో మార్పు తీసుకురండి: ప్రభుత్వ కార్యదర్శులకు ప్రధాని సూచన
కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి సమస్యలు గుర్తించాలని, తమ పనిని అవకాశంగా మార్చుకుని, ప్రభుత్వ పాలనలో మార్పులు తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీ, ప్రభుత్వ కార్యదర్శులకు సూచించారు. గురువారం 80 మందికి పైగా అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు మోదీని కలిశారు. వృత్తిని పనిలా చూడకుండా దేశానికి సేవ చేయగల అవకాశంగా పరిగణించాలని మోదీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా వీలైనంత మేరకు సాంకేతికత సహాయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశంలోని 100 వెనకబడిన జిల్లాలపై ప్రధానంగా దృష్టిసారించాలని కార్యదర్శులకు మోదీ తెలియజేశారు. చర్చలో భాగంగా 2001 గుజరాత్ భూకంపం సమయంలో అధికారుల చాకచక్యాన్ని, పనితీరుని ఆయన గుర్తుచేశారు. అలాగే వాతావరణ పరిస్థితులు, పరిశుభ్రత, వ్యవసాయం, విద్య గురించి కూడా అధికారులు ప్రధానితో చర్చించినట్లు సమాచారం.