: దోరగా వేయించిన దోశలాగ ఉంది.... రూ. 200 నోటుపై నెటిజన్ల కామెంట్!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన రూ. 200 నోటుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. ఇందుకోసం వారిలో ఉన్న హాస్యకోణాన్ని వెతికి మరీ బయటికి తీస్తున్నారు. ముఖ్యంగా నోటు రంగు మీదే చాలా మంది నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. కాషాయ రంగులో ఉన్న ఈ నోటు దోరగా వేయించిన దోశను తలపిస్తుందని, బాగా మరగబెట్టిన ఇరానీ చాయ్ రంగులో ఉందని అంటున్నారు.
నోటును వినాయక చవితి రోజు విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వం హిందుత్వాన్ని చూపించిందని విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 50 నోట్లన్నీ అమ్మాయిలకు బాగా ఇష్టమైన రంగుల్లోనే ఉన్నాయని, మరి అబ్బాయిలకోసం నోట్లు ప్రచురించరా? అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే మార్కెట్‌లో పప్పు ధర రూ. 200 దాటిందని, అందుకే రూ. 200 నోటును పప్పు రంగులో ముద్రించారని మరికొందరు నెటిజన్లు హాస్యం పండిస్తున్నారు.