: దెబ్బ మీద దెబ్బ! పీకలోతు కష్టాల్లో శశికళ.. ప్రభుత్వపరం కానున్న ఆస్తులు!
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ‘చిన్నమ్మ’ ఇప్పుడు ఆస్తులను సైతం కోల్పేయే పరిస్థితుల్లో చిక్కుకున్నారు. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. ప్రస్తుతం పరప్పన జైలులో ఉన్న ఈ ముగ్గురూ వెంటనే రూ.10 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది.
ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో వారి ఆస్తులను వేలం వేయడం ద్వారా ఆ సొమ్మును ప్రభుత్వం జమ చేసుకుంటుంది. లేదంటే శిక్షా కాలాన్ని మరింత పొడిగించే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా శశికళ రాజకీయ జీవితం అంతమైనట్టే లెక్క. అయితే శశికళ, ఇళవరసి, సుధాకరన్ ఆస్తులను జప్తు చేసేందుకే కర్ణాటక ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.