: ఆసియా మహిళను `చింగ్ చాంగ్` అన్న రెస్టారెంట్ ఉద్యోగి... సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ... రెస్టారెంట్ యాజమాన్యం క్షమాపణ!
అమెరికాలో జాతి వివక్షకు సంబంధించిన సంఘటనలు రోజుకొకటి బయటికొస్తూనే ఉంటాయి. అదేవిధంగా రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఆసియన్ మహిళ పేరును బిల్లులో `చింగ్ చాంగ్` (చైనీయులను హేళన చేసే పదం) అని టైప్ చేసిన ఉద్యోగి కారణంగా రెస్టారెంట్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాల్సివచ్చింది. మహిళ కుమారుడి స్నేహితుడు ఆ బిల్లు ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. దీంతో న్యూయార్క్‌లోని కార్నర్ స్టోన్ రెస్టారెంట్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.
`పేరు తెలియక పోతే తెలుసుకోవాలి కానీ ఇలా ముఖం చూసి చింగ్ చాంగ్ అని రాయడం జాతి వివక్షకు పరాకాష్ట` అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెస్టారెంట్ వద్ద నిరసనలు చేపట్టడానికి కూడా ముందుకొచ్చారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం దిగొచ్చింది. సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ వివాదానికి కారణమైన ఉద్యోగిని తొలగించింది.