: ఆ వార్తల్లో నిజం లేదు... సుష్మస్వరాజ్ పాత్ర పోషించనుందంటూ వస్తున్న వార్తలపై స్పందించిన టబు!
కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ రక్షించిన భారత మహిళ ఉజ్మా అహ్మద్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు ధీరజ్ కుమార్ తీయనున్న సినిమాలో సుష్మ పాత్రను టబు పోషించనున్నారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఇలాంటి సినిమా ఒకటి తీస్తున్నారనే సంగతే తనకు తెలియదని టబు స్పష్టం చేశారు. తమ సినిమా పబ్లిసిటీ కోసం ఇలాంటి వార్తలను సృష్టించే నిర్మాణ సంస్థలపై ఆమె మండిపడ్డారు.
`మమ్మల్ని కలవకముందే నిర్మాణ సంస్థలు ఇలాంటి అసత్య ప్రకటనలు ఎందుకు చేస్తాయో నాకు అర్థం కావట్లేదు. గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. కొన్ని సార్లు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా నన్ను సంప్రదించకుండానే వారి సినిమాల్లో నేను నటిస్తున్నట్లు ప్రకటించాయి. తమ సినిమా అవకాశాన్ని ఒప్పుకోవడంలో నటులపై ఒత్తిడి సృష్టించడానికే వాళ్లు ఇలాంటి పనులకు పూనుకుంటారు` అని ఆమె అన్నారు. ప్రస్తుతం టబు, రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగణ్ హీరోగా వస్తున్న `గోల్‌మాల్ అగైన్` చిత్రంలో నటిస్తున్నారు.