: మన దేశంలో మొట్టమొదటి సరోగసీ ఆవుదూడ జననం!


ఓ ఆవు అద్దె గర్భం (సరోగసీ) ద్వారా ఓ దూడకు జన్మనిచ్చింది. భారత్ లో ఈ విధానం ద్వారా దూడ జన్మించడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. ఈ విధానంలో పుట్టిన దూడకు ‘విజయ్’ అని పేరు పెట్టారు. పుణెకి చెందిన ప్రముఖ ఎన్జీవో సంస్థ జేకే ట్రస్ట్ ‘జేకే బోవాజెనిక్స్’ పేరిట అద్దె గర్భం ద్వారా దూడలను పుట్టించే సదుపాయం కల్పిస్తోంది. ఈ సందర్భంగా జేకే ట్రస్ట్ సీఈవో డాక్టర్ శ్యాం జావర్ మాట్లాడుతూ, సాధారణంగా ఒక ఆవు తన జీవితకాలం పదిహేనేళ్ల వ్యవధిలో కేవలం పది దూడలకు మాత్రమే జన్మనివ్వగలుగుతుందని అన్నారు.

 అయితే, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) టెక్నాలజీ ద్వారా మరో  పది దూడల వరకూ జన్మనిచ్చే వీలుంటుందని అన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి రైతు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఓ మొబైల్ ఐవీఎఫ్ ల్యాబ్ ద్వారా సరోగసీ ప్రక్రియ గురించి రైతులకు అన్ని విషయాలు తెలిసేలా చెబుతామని చెప్పారు. కాగా, గిర్ జాతి ఎద్దుపై ప్రయోగం చేయడంలో ఈ ట్రస్ట్ విజయవంతమైంది.ఈ ట్రస్ట్ కు చెందిన ల్యాబ్ లు దేశం మొత్తంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి మహారాష్ట్రలో ఉండగా, మరోటి ఛత్తీస్ గడ్ లో ఉంది. దేశ వ్యాప్తంగా వారి శాఖలను విస్తరించే పనిలో ట్రస్ట్ ఉంది.

  • Loading...

More Telugu News