: `ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ నెట్‌వర్క్‌కి ఇవ్వొద్దు`... సమాచార శాఖ, బీసీసీఐకి డిష్ టీవీ లేఖ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులను స్టార్ నెట్‌వర్క్ వారికి ఇవ్వొద్దని సమాచార ప్రసారాల శాఖ, బీసీసీఐలను డిష్ టీవీ కోరింది. ఈ విషయంపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఓ లేఖను సమర్పించింది. ఒకవేళ ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా స్టార్ వారికి ఇస్తే క్రీడల ప్రసారాల విభాగంలో స్టార్ నెట్‌వర్క్ గుత్తాధిపత్యం పెరిగి, వీక్షకులు పెద్దమొత్తాల్లో సబ్‌స్క్రిప్షన్ ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని లేఖలో పేర్కొంది.
డిష్ టీవీ ఎండీ, చైర్మన్ జవహర్ గోయల్ ఈ లేఖను సమాచార శాఖ, బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీలతో పాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలకు కూడా పంపించారు. స్టార్ నెట్‌వర్క్ వారికి ఇప్పటికే దేశీయ క్రికెట్ ఐసీసీ టోర్నమెంట్ ప్రసార హక్కులతో పాటు, ఆసియా కప్ హక్కులు కూడా ఉన్నాయి. అలాగే ఇతర దేశాలైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ క్రికెట్ టోర్నమెంట్ల ప్రసార హక్కులు కూడా ఉన్నాయి. ఇక ఐపీఎల్ హక్కులు స్టార్ హస్తగతమైతే అన్ని రకాల క్రికెట్ టోర్నమెంట్ ప్రసారాలపై వారి గుత్తాధిపత్యం చెలరేగే అవకాశం ఉంది.