: సెప్టెంబర్ 12న ఆపిల్ ఐఫోన్ 8 విడుదల?
మాక్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ ఐఫోన్ 8ను సెప్టెంబర్ 12న ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ 22 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ టెక్నాలజీ వెబ్‌సైట్ మాక్4ఎవర్ తెలియజేసింది. ఐఫోన్ 8ను సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఆపిల్ ఇంతకుముందే ప్రకటించింది. కాకపోతే అందుకు సంబంధించిన సరైన తేదీలను మాత్రం ప్రకటించలేదు.
అయితే కొన్ని టెక్నాలజీ అప్‌డేట్లు పునరుద్ధరించాల్సిన కారణంగా ఐఫోన్ 8 ఆవిష్కరణ వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఫ్రెంచ్ వెబ్‌సైట్ ప్రకటన మేరకు అలాంటిదేం లేదని తెలుస్తోంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌తో రానున్న ఐఫోన్ 8పై మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు 3డీ కెమెరా, ఫేషియల్ రికగ్నిషన్ వంటి ఇతర ఫీచర్లతో ఉన్న ఈ ఫోన్ ధర రూ. 65,000కు పైనే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఫోన్ 8తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్‌లను కూడా విడుదల చేసేందుకు ఆపిల్ సిద్ధంగా ఉందని మాక్4ఎవర్ పేర్కొంది.