: సోనోగ్రఫీ పరీక్షలకు కూడా ఆధార్ తప్పనిసరి... మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
రాష్ట్రాలు దాటి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారిని, భ్రూణహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్యను తగ్గించి, రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తిని పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆధార్ సహాయం తీసుకోనుంది. ఇందుకోసం సోనోగ్రఫీ పరీక్షలు చేయించుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాల్సిందేనని నిబంధన తీసుకొచ్చింది. ముంబై లాంటి నగరాలతో పోల్చినపుడు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో స్త్రీ, పురుష నిష్పత్తి దారుణంగా పడిపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
లింగ నిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి ప్రక్రియల కోసం మహారాష్ట్ర ప్రజలు ఇతర పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలుసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయా పరీక్షలకు ఆధార్ తప్పనిసరి చేస్తే ఈ పరిస్థితి మెరుగుపడే అవకాశాలుంటాయని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, చత్తీస్గఢ్ రాష్ట్రాలతో కూడా ఒప్పందం చేసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.