: పెరుగుతున్న ఐపీఎల్ బ్రాండ్ విలువ... ఈ ఏడాది రూ. 34 వేల కోట్లకు చేరిక
పది సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ క్రికెట్ అభిమానులకు ఓ పండగ లాంటిది. వారి కారణంగానే ప్రతి ఏడాది దీని బ్రాండ్ విలువ పెరిగిపోతుంది. ఈ ఏడాది ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ. 34 వేల కోట్లకు చేరినట్టు ప్రపంచ మూల్యంకన కార్పొరేట్ ఫైనాన్స్ సలహా సంస్థ డఫ్ అండ్ ఫెల్ప్స్ తెలిపింది. గతేడాదితో పోల్చినపుడు ఈ విలువ 8 వేల కోట్లు పెరిగినట్లు ఈ సంస్థ అధ్యయనంలో తేలింది.
అంతేకాకుండా ఐపీఎల్ జట్ల బ్రాండ్ విలువను కూడా ఈ సంస్థ లెక్కకట్టింది. రూ.678 కోట్ల బ్రాండ్ విలువతో ముంబై ఇండియన్స్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, రూ.634 కోట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్, రూ. 563 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. గ్రామీణ ప్రాంత ప్రేక్షకులు విపరీతంగా పెరగడం, ప్రకటనలు, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు వంటి కారణాల వల్ల బ్రాండ్ విలువ పెరుగుతోందని సంస్థ నివేదికలో పేర్కొంది.