: కాయ్ రాజా కాయ్...!: నంద్యాల ఫలితంపై భారీ స్థాయిలో బెట్టింగ్.. విజయం మాదంటే మాదేనంటున్న ప్రధాన పార్టీలు!
నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై భారీ స్థాయిలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. రెండు పార్టీలు విజయం తమదంటే తమదేనని ప్రకటించుకున్న నేపథ్యంలో ఈ బెట్టింగ్ లు మరింత పెరిగాయి. ఓటింగ్ శాతం పెరిగిందని, ఉదయం నుంచే ఓటర్లు బారులుతీరారన్న మీడియా వార్తల నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్లో ఎవరిని విజయం వరిస్తుందన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ రెండు పార్టీల మద్దతుదారులు భారీ ఎత్తున బెట్టింగ్ లలో పాల్గొంటున్నారు.
అయితే టీడీపీ మద్దతుదారుల కంటే వైఎస్సార్సీపీ మద్దతుదారులు దూకుడు ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ ముందు వరకు రూపాయికి రూపాయిగా సాగిన బెట్టింగ్ లు పోలింగ్ ముగిసిన అనంతరం టీడీపీ గెలిస్తే రూపాయిన్నర ఇస్తామని వైసీపీ మద్దతు దారులు పేర్కొనడం గెలుపుపై వారి విశ్వాసాన్ని చూపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు పెరిగిందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతుండగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే పోలింగ్ పెరిగిందని టీడీపీ మద్దతు దారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ ల రూపంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది.