: గుర్మీత్ రామ్ రహీం సింగ్ కేసులో రేపే తీర్పు.. ఛండీగఢ్, హర్యానాల్లో హై అలెర్ట్, 144 సెక్షన్.. కేంద్ర బలగాల డేగకన్ను!
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్ స్టార్ బాబాగా పేరొందిన గుర్మీత్ రామ్ రహీం సింగ్ 2002లో హర్యానాలోని సిర్సా శివార్లలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయంలో తమపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఇద్దరు మహిళా సాధ్విలు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లోనే పెను దుమారం రేగింది. అయితే 2007లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ న్యాయస్థానం విచారణ చేబట్టింది. ఈ కేసులో సీబీఐ కోర్టు రేపు కీలక తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో పంచకులలోని గుర్మీత్ రాంరహీం సింగ్ ప్రార్థనా స్థలానికి 35,000 మంది భక్తులు చేరుకున్నారు.
నేటి సాయంత్రానికి సుమారు 2,00,000 మంది భక్తులు ఈ ఆశ్రమానికి చేరుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. తీర్పు ప్రతికూలంగా వస్తే వీరంతా విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో హై అలెర్ట్ ప్రకటించి, 144 సెక్షన్ విధించారు. 75 కంపెనీల కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. పంచకులలోని పాఠశాలలన్నింటికీ రెండు రోజులు సెలవులు ఇచ్చారు. వినాయకచవితి కావడంతో వరుసగా గురు, శుక్ర, శని, ఆదివారాలు సెలువులుగా భావించవచ్చని పిల్లలకు సమాచారం అందించారు. పంచకుల జిల్లా కోర్టుకు వెళ్లే మార్గాలన్నిటిపైన నిఘా పెంచారు. డ్రోన్ ల సాయంతో నిరంతరం నిఘా వేస్తూ, పరిస్థితులను అంచనా వేస్తున్నారు.