: నితిన్ గడ్కరీకి రైల్వే శాఖ... రక్షణ శాఖకు సురేష్ ప్రభు?


ఒకే వారంలో జరిగిన రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తన పదవికి రాజీనామా చేయగా, ప్రధాని కొన్నాళ్లు ఆగమని చెప్పినట్టు వార్తలొచ్చాయి. సరికొత్త సంస్కరణలు అమలు చేయడం ద్వారా, రైల్వేల్లో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూ సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రైల్వే మంత్రిగా సురేష్ ప్రభు సమర్థవంతమైన కేంద్ర మంత్రిగా నిరూపించుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో సురేష్ ప్రభు రైల్వే శాఖపై తనదైన ప్రభావం చూపించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను ఆమోదించి, ఆయనకు రక్షణ శాఖను కేటాయించనున్నట్టు ఢిల్లీలో వార్తలు వెలువడుతున్నాయి. అదే సమయంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రైల్వే శాఖను అప్పగించనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ మధ్యే భాగస్వామ్యం కుదిరిన జేడీయూ, అన్నాడీఎంకేలకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించేందుకు కేంద్ర మంత్రి వర్గపునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పలువురు మంత్రులను తప్పించి, వారి స్థానాలను కొత్తవారితో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సురేష్ ప్రభు రాజీనామాను ఆమోదించి, ఆయనను రక్షణ శాఖకు పంపనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖాళీ చేసిన పట్టణాభివృద్ధి శాఖ ఖాళీగా మిగిలి ఉంది. దీనిని కూడా భర్తీ చేయాల్సి వుంది.  

  • Loading...

More Telugu News