: సమయం వచ్చేసింది!: నేటి నుంచి జియో 4జీ ఫీచర్ ఫోన్ బుకింగ్.. సాయంత్రం ఐదు గంటలకు ముహూర్తం!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నేటి సాయంత్రం 5:30 గంటల నుంచి జియో ఫీచర్ ఫోన్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్‌లో మై జియో యాప్‌తోపాటు, జియో డాట్‌కామ్ ద్వారా ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక ఆఫ్‌లైన్‌లో జియో రిటైల్ స్టోర్లు, మల్టీ బ్రాండ్ డివైజ్ రిటైలర్లు, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ‘జియో ఫోన్’ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
బుకింగ్ సందర్భంగా తొలుత రూ.500 చెల్లించాల్సి ఉంటుందని, మిగతా వెయ్యిరూపాయలు డెలివరీ సమయంలో చెల్లించవచ్చని తెలిపింది. ఈ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకోవచ్చని వివరించింది. కాగా, పేరుకు ఇది ఫీచర్ ఫోనే అయినా, దీంట్లో స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అన్ని సదుపాయాలు ఉంటాయి. అన్ని రకాల యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. సినిమాలు చూసుకోవచ్చు. వీడియో కాల్స్ చేసుకోవచ్చు. యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.