: శశికళ ఆశలపై నీళ్లు చల్లిన సుప్రీంకోర్టు!
అన్నాడీఎంకే నేత శశికళ ఆశలపై సుప్రీం కోర్టు నీళ్లుచల్లింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆమె, ఆమె అక్క కుమారుడు సుధాకరన్, ఆమె వదిన ఇళవరసి రివ్యూ పిటిషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు.
దీనిని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో శశికళకు ఊహించని దెబ్బతగిలింది. మరోపక్క, జైలు అధికారులకు 2 కోట్ల రూపాయల లంచం ఇచ్చి జైలులో సర్వసౌఖ్యాలు పొందుతున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. అలాగే, ఆమెను పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శశికళకు ఈ తీర్పు శరాఘాతంలా తగిలింది.