: అలీఘడ్ ముస్లిం వర్సిటీలో మహిళా రిపోర్టర్ ని రౌడీల్లా చుట్టుముట్టి బెదిరించిన యువకులు.. వీడియో వైరల్!
ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేస్తున్నట్లు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం యువతులు హర్షం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో విద్యార్థినుల స్పందన గురించి తెలుసుకునేందుకు వెళ్లిన ఇండియా టుడే జర్నలిస్ట్ ఇల్మా హాసన్‌పై అక్కడి యువకులు హద్దులు మీరి ప్రవర్తించారు. అక్కడి విద్యార్థినులతో ఆమె లైవ్‌లో మాట్లాడిస్తుండగా అక్కడికి వచ్చిన కొంత మంది యువకులు ఆ జర్నలిస్టును చుట్టుముట్టారు. ఎవరి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చావ్? అంటూ లైవ్‌లోనే బెదిరించారు. సుమారు పది మంది యువకులు ఆమెను చుట్టుముట్టి ఆ లైవ్ జరగకుండా అడ్డుకున్నారు. కెమెరామెన్ ని కూడా బెదిరించారు.
దాదాపు అర్ధగంటపాటు ఆ యువకులు తనను చుట్టుముట్టారని ఇల్మా హాసన్ తెలిపింది. తాను ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ రాహుల్ కన్వాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. విద్యార్థినులతో మాట్లాడించడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటువంటి గుండాగిరి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ సీఎం ఈ విషయంపై స్పందించి ఆ యువకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమండ్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల మంది చూశారు. ఆ యువకుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.