: చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం: భన్వర్ లాల్
నంద్యాల ఉప ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 77.66 శాతం పోలింగ్ నమోదైందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ అన్నారు. పోలింగ్ సమయం ముగిసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై గట్టి నిఘా పెట్టామని చెప్పారు. వీవీ పాట్ యంత్రాలు బాగా పనిచేశాయని అన్నారు.
ఈ రోజు క్యూలో ఉన్నవారంతా ఓటు వేసిన తరువాత మొత్తం 81 లేక 82 శాతం పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని భన్వర్ లాల్ చెప్పారు. నంద్యాలలో 2009లో 76 శాతం, 2014లో 71 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. ఈ నెల 28న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.