: యూపీఐ, భిమ్ ద్వారా చెల్లింపు సదుపాయాన్ని కల్పించిన ఊబెర్
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ క్యాబ్ సర్వీస్ సంస్థ ఊబెర్, భారత వినియోగదారులకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ), భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భిమ్) యాప్ల ద్వారా చెల్లింపు చేసే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ వారాంతం నుంచి ఈ పేమెంట్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఊబెర్కు దేశవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వీరంతా వారానికి 9.4 మిలియన్ల ట్రిప్పులు తిరుగుతున్నారు.
యూపీఐ, భిమ్ సౌకర్యాల ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల సహకారంతో ఊబెర్ ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇతర 52 బ్యాంకుల అకౌంట్లను కూడా దీనికి అనుసంధానం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఊబెర్కు పోటీగా ఉన్న ఓలా క్యాబ్ వారు తమ యాప్లో యూపీఐ సదుపాయాన్ని ఆర్నెల్ల క్రితమే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.