: ఈజీమనీ కోసం తెగించిన ప్రేమజంట.. వినూత్న రీతిలో దొంగతనాలు !


ఈజీ మనీ కోసం ఓ ప్రేమజంట దొంగతనాలకు పాల్పడుతున్న తీరు వెరైటీగా ఉంది. ఢిల్లీలోని ఇందర్ పురి ప్రాంతానికి చెందిన అంజలి రాజ్ పుత్ ఓ బ్యూటీషియన్. ఆమెకు ఏడాది క్రితం సుమిత్ అనే వ్యక్తితో పరిచయమైంది. వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. బంగారు నగలు తయారు చేసే సంస్థలో సుమిత్ పనిచేస్తుంటాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సుమిత్ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇందుకు, అంజలి కూడా తన ప్రియుడికి సాయం చేసింది.

ఎలా అంటే.. వృత్తి రీత్యా బ్యూటీషియన్ అయిన అంజలి, మేకప్ వేస్తానంటూ ఇంటింటికీ వెళ్లేది. మేకప్ వేయించుకునేందుకు ఎవరైనా ఇష్టపడితే ఆ సమాచారాన్ని సుజిత్ కు చెప్పేది. వారి ముఖాలకు ఫేషియల్  చేసి కళ్లు మూయాలని, మంచి ఫలితాలు రావాలంటే కదలకుండా అలానే ఉండాలని వారికి చెబుతుండేది. దీంతో, బ్యూటీషియన్ చెప్పిన విషయాలను వారు తు.చ.తప్పకుండా పాటించేవారు.

అయితే, వాళ్లు కళ్లు మూసుకుని కూర్చున్న తర్వాతే అసలు కథ మొదలయ్యేది. ఆ ఇంట్లోకి సుజిత్ రావడం, విలువైన వస్తువులను సైలెంట్ గా పట్టుకుపోవడం చేసేవాడు. ఆ తర్వాత సదరు వ్యక్తికి వేసిన మేకప్ ను అంజలి తీసివేసేది. ఇలాంటి వరుస సంఘటనలకు సంబంధించి బాధితుల ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయం బయటపడినట్టు వెస్ట్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. నిందితులు ఇప్పటివరకూ రూ.24 వేల నగదు, రూ.1.5 లక్షల విలువ చేసే నగలను ఎత్తుకెళ్లినట్టు తమ విచారణలో తెలిసిందని చెప్పారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రేమజంట దొంగతనాలకు పాల్పడేదని చెప్పారు.

  • Loading...

More Telugu News