: `పందీ... నువ్వు అమెరికా వదిలి, నీ దేశం వెళ్లిపో!`... భారత సంతతి సీఈఓపై ట్రంప్ మద్దతు వర్గం దూషణలు
అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘటనపై ట్రంప్ వైఖరిని వ్యతిరేకిస్తున్నానని ఓ వ్యాసంలో పేర్కొన్న భారత సంతతి వ్యాపారస్తుడిపై అధ్యక్షుడి మద్దతు వర్గం దూషణల వర్షం కురిపించింది. ఈ-మెయిళ్లు, ట్వీట్లు, ఫోన్ కాల్స్ ద్వారా అతన్ని నానా మాటలు అన్నారు. జీఎంఎం నాన్‌స్టిక్ కోటింగ్స్ సంస్థకు సీఈఓగా ఉన్న రవీన్ గాంధీ సీఎన్‌బీసీలో ఓ వ్యాసం పోస్ట్ చేశారు.
ట్రంప్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఆర్థిక వ్యవస్థను ఎంత ముందుకు తీసుకెళ్లినా, చార్లెసట్‌విల్లే ఘటన తర్వాత ఆయనపై నమ్మకం పోయిందని, తన రంగులో లేని అమెరికన్లపై జరుగుతున్న దౌర్జన్యాలను ట్రంప్ చూసీచూడనట్లు వదిలేయడం సబబు కాదని, ఈ కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన విధానాలకు ఇక నుంచి మద్దతు తెలియజేయనని గాంధీ వ్యాసంలో పేర్కొన్నారు. దీంతో ఆయనపై కొంత మంది ట్రంప్ మద్దతుదార్లు దూషణల పర్వం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తనను `పంది...పరదేశీ` అంటూ ఫోన్‌కాల్ ద్వారా ఓ యువతి అన్న మాటలను గాంధీ యూట్యూబ్‌లో షేర్ చేశారు. తనను చాలా మంది చెప్పుకోలేని విధంగా దూషించారని గాంధీ మీడియాకు తెలియజేశారు.