: సీఎం చంద్రబాబుకు ఎన్నికల నియమావళి తెలియదా?: వాసిరెడ్డి పద్మ
ఎన్నికల సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం చంద్రబాబుకు ఎన్నికల నియమావళి తెలియదా? అని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల ఎన్నికల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం దారుణమని అన్నారు. మంత్రులు కంట్రోల్ రూమ్ లో ఉండి అధికారులకు ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అధికారులకు సీఎం నుంచే ఆదేశాలు వెళ్లడంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని ఈ సందర్బంగా ఆమె డిమాండ్ చేశారు.
ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నంద్యాలలో ఎందుకు తిరుగుతున్నారని, ఇదంతా సీఎం కనుసన్నల్లోనే జరుగుతున్నట్టుగా కనిపిస్తోందని ఆరోపించారు. పోలీసులు అధికారపక్షానికి తొత్తులుగా వ్యవహరించడం సబబు కాదని, నిన్న రాత్రి శిల్పామోహన్ రెడ్డి ఏజెంట్ల విషయంలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. శిల్పా చక్రపాణిరెడ్డి తన ఆధార్ కార్డు చూపించినప్పటికీ ఆయన్ని నంద్యాల నుంచి బయటకు పంపాలని పోలీసులు చూశారని మండిపడ్డారు. వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, ఓటర్లు మరింత భారీగా పోలింగ్ లో పాల్గొనాలని వాసిరెడ్డి పద్మ కోరారు.