: కండల వీరుడు కన్నీటి పర్యంతం... అభిమానుల్లో స్ఫూర్తి నింపిన రెజ్లర్ జాన్ సెనా... వీడియో చూడండి!
`జాన్ సెనా`...!
డబ్ల్యూడబ్ల్యూఈ మల్లయుద్ధ పోటీలు చూసే వారికి ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. `నెవర్ గివ్ అప్` అంటూ బరిలోకి దిగే జాన్ సెనా ఎంతోమంది అభిమానుల్లో స్ఫూర్తి నింపాడు. వారంతా కలిసి ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. అభిమానుల కారణంగా జాన్ కన్నీటి పర్యంతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూసిన వారిని కూడా ఈ వీడియో ఉద్వేగానికి లోను చేస్తోంది.
ఇందులో తన అభిమానులు తనకు కృతజ్ఞతగా రాసిన ఉత్తరాలను జాన్ చదువుతుంటాడు. అందరూ వారి కష్టాల నుంచి బయటపడటానికి జాన్ ఎలా సాయం చేశాడో ఆ ఉత్తరాల్లో వివరించారు. చివరగా ఒక బాలుడు కృతజ్ఞతగా పంపిన వీడియోను జాన్ చూస్తాడు. తన తల్లి కేన్సర్ చికిత్సలో భాగంగా జాన్ చెప్పిన `నెవర్ గివ్ అప్` బ్యాడ్జి ఎలా ఉపయోగపడిందో వివరిస్తూ, బాలుడు ఏడుస్తుంటాడు. అది చూసి జాన్ కూడా కంటతడి పెట్టుకుంటాడు. అదే సమయంలో అటు పక్క నుంచి వీడియోలో ఉన్న బాలుడు, జాన్ దగ్గరికి వస్తాడు. దీంతో జాన్ ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటాడు.
అంతేకాకుండా ఇంతకుముందు జాన్ చదివిన ఉత్తరాలు రాసిన వారందరూ కూడా ఒక్కొక్కరుగా జాన్ ముందుకు వస్తుంటారు. అది చూసి `బెస్ట్ సర్‌ప్రైజ్` అంటూ అందర్నీ కౌగిలించుకుని, కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లు తన అభిమాన మల్లయోధుడిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసి, `లైఫ్ చేంజర్` అని రాసి ఉన్న కప్‌ను బహుమతిగా ఇస్తారు.