: ఇన్ఫోసిస్‌కు నందన్ నీలేకని?... పెరుగుతున్న షేర్ల ధర
విశాల్ సిక్కా రాజీనామా తర్వాత ఇన్ఫోసిస్ పగ్గాలు చేపట్టానికి ఇంతకు ముందు సీఈఓగా పనిచేసిన నందన్ నీలేకని రాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సిక్కా రాజీనామా కారణంగా భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్ స్టాక్ ధరలు, నందన్ నీలేకని వస్తున్నారనే వార్తలతో పుంజుకుంటున్నాయి. ఈరోజు మధ్యాహ్నానికి ఇన్ఫోసిస్ షేర్ల ధరలు 2.8 శాతం పెరిగి, ఒక్కో షేర్ ధర రూ. 899.95 వద్దకు చేరుకున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తెలిపింది.
ఇదిలా ఉండగా నందన్ నీలేకనికి ఎగ్జిక్యూటివ్ స్థానం కాకుండా మరేదైనా నాన్-ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ విషయంపై 48 గంటల్లోగా స్పష్టత రానుంది. ఇన్ఫోసిస్‌ను స్థాపించిన ఏడుగురు వ్యవస్థాపకుల్లో నందన్ నీలేకని కూడా ఉన్నారు. మార్చి 2002 నుంచి ఏప్రిల్ 2007 వరకు ఆయన ఇన్ఫీ సీఈఓగా పని చేశారు. తర్వాత 2009లో ఆధార్ అథారిటీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్ఫీ ఆపద్ధర్మ సీఈఓగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావ్ ఉన్న సంగతి తెలిసిందే.