: 'రాక్ స్టార్ బాబా' రేప్ కేసులో తీర్పు... పంజాబ్, హర్యానాలో రెడ్ అలెర్ట్!
'రాక్ స్టార్ బాబా'గా పేరొందిన గుర్మీత్ రాం రహీం సింగ్ రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2002లో హర్యానాలోని సిర్సా శివార్లలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయంలో తమపై గుర్మీత్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఇద్దరు మహిళా సాధ్విలు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లోనే పెను దుమారం రేగింది. అయితే 2007లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ న్యాయస్థానం విచారణ చేపట్టి, బాధిత సాధ్విల నుంచి వాంగ్మూలం సేకరించింది. తనపై వచ్చిన ఆరోపణలను గుర్మీత్ రాం రహీం సింగ్ ఖండించారు. ఈ కేసులో సీబీఐ కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెల్లడించనుంది.
ఈ నేపధ్యంలో రాక్ స్టార్ బాబాకు మద్దతుగా భారీ ఎత్తున ఆయన మద్దతుదారులు పంచకులకు చేరుకుంటున్నారు. వారిని నిరోధించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పంచకులలోని ఆశ్రమానికి భారీ సంఖ్యలో వారు చేరడం పంజాబ్, హర్యానా రాష్ట్రాల పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పంచకులలోని బాబా ఆశ్రమానికి 30,000 మంది మద్దతుదారులు చేరుకున్నారని, దీంతో తీర్పు నేపథ్యంలో ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. పారామిలటరీ బలగాలను ఆ రెండు రాష్ట్రాలకు తరలించారు. గుర్మీత్ మద్దతుదారులు ప్రశాంతంగా ఉండాలని, చట్టానికి కట్టుబడి ఉండాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుపునిచ్చారు.