: 153 కేజీల అతిపెద్ద సమోసా... గిన్నిస్ రికార్డు బ్రేక్!
లండన్‌కు చెందిన ఓ ముస్లిం ఛారిటీ సంస్థ 153.1 కేజీల సమోసాను తయారు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించింది. 12 మంది స్వచ్ఛంద సేవకులు కలిసి ఈ సమోసాను తయారుచేశారు. గతంలో 110.8 కేజీల సమోసా తయారు చేసి ఇంగ్లండ్‌కు చెందిన బార్డ్‌ఫోర్డ్ కళాశాల వారు సృష్టించిన గిన్నిస్ రికార్డును వీరు తిరగరాశారు. ఈ సమోసాను ఒక తీగజల్లెడ మీద రూపొందించి, దాన్ని ప్రత్యేకంగా తయారుచేయించిన నూనె మూకుడులో వేయించారు. ఈ ప్రక్రియను మొత్తం గిన్నిస్ తరఫు అధికారి ప్రవీణ్ పటేల్ దగ్గరుండి గమనించారు.
గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాలంటే సమోసా త్రిభుజాకారంగా ఉండాలి. అందులో ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, బఠానీ గింజలు ఉండాలి. అలాగే వేగేటపుడు అది పగలిపోకూడదు. ఇలా నియమాలన్నింటిని సంతృప్తిపరిస్తేనే గిన్నిస్ వాళ్లు దాన్ని సమోసాగా గుర్తిస్తారు. ఈ పెద్ద సమోసా నూనెలో వేగుతున్నపుడు ఓ చిన్న రంధ్రం ఏర్పడి చీలిక వచ్చిందని, దాంతో సమోసా ఎక్కడ విచ్ఛిన్నమవుతుందోనని తాను భయపడినట్టు ఈ సమోసా తయారీలో పాల్గొన్న ఫరీద్ ఇస్లాం తెలిపాడు. కానీ అలా జరగలేదని, పూర్తి వేగిన తర్వాత సమోసాను రుచి చూసి, గిన్నిస్ అధికారి ఆమోదం తెలిపినపుడు తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయని ఫరీద్ పేర్కొన్నాడు. ఈ సమోసాను భాగాలుగా చేసి స్వచ్ఛంద సంస్థ తరఫున నిరాశ్రయులకు పంచిపెట్టారు.