: ట్రిపుల్ తలాక్ ను నిషేధించిన 9 దేశాలు ఇవే...!


దేశంలో ట్రిపుల్ తలాక్ పద్ధతిని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో దీనిపియా పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ప్రపంచంలోని 19 దేశాల్లో ఇప్పటికే ట్రిపుల్ తలాక్ నిషేధించారని రికార్డులు చెబుతున్నాయి. అందులో ముస్లిం మెజారిటీ దేశాలైన ఇండొనేషియా, పాకిస్థాన్‌, ఈజిప్టు, బంగ్లాదేశ్‌, టర్కీ, ఇరాన్, వంటి దేశాలతో పాటు ట్యునీషియా, అల్జీరియా, శ్రీలంక దేశాలు కూడా ఉన్నాయి. ఆయా దేశాల్లో విడాకులు ఇచ్చే విధానంలోకి వెళ్తే...

1) ఇండొనేషియా: దాదాపు 90 శాతం ముస్లిం జనాభా ఉన్న ఇండొనేషియాలో విడాకుల్ని తలాక్‌ ద్వారా తీసుకోవడం కుదరదు. ఇండొనేషియా వివాహ నిబంధనల్లోని ఆర్టికల్‌ 19 ప్రకారం- విడాకులు కోరుకునే వ్యక్తి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత న్యాయస్థానం విచారించి విడాకులు మంజూరు చేస్తుంది.
2) పాకిస్థాన్‌: దాదాపు 96 శాతం ముస్లిం జనాభా ఉన్న పాకిస్థాన్‌ 1961లోనే ట్రిపుల్ తలాక్‌ ను నిషేధించింది. భార్యకు విడాకులివ్వాలనుకునే వ్యక్తి ముందుగా న్యాయ మండలి ఛైర్మన్‌ తో పాటు తన భార్యకు కూడా లీగల్‌ నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 90 రోజుల సమయం ఉంటుంది. ఈలోగా కౌన్సిలింగ్‌ నిర్వహించి, కలిపే ప్రయత్నమూ చేస్తారు.
3) ఈజిప్టు: తలాక్‌ విధానానికి సవరణలు చేసిన తొలిదేశం ఈజిప్టు. 1929లోనే ఈ దేశంలో దీనికి సవరణలు చేశారు. తలాక్‌ కు, తలాక్‌ కు మధ్య 90 రోజుల వ్యవధి ఉండాలన్న నియమం పెట్టుకున్నారు. ఒకే విడతలో మూడుసార్లు తలాక్‌ చెప్పినా.. దానిని మొదటి విడత కిందే పరిగణిస్తారు.
4) బంగ్లాదేశ్‌: దాదాపు 89 శాతం ముస్లిం జనాభా కలిగిన బంగ్లాదేశ్‌ లో ట్రిపుల్ తలాక్‌ చెల్లదు.
5) టర్కీ: దాదాపు 99 శాతం ముస్లిం జనాభా కలిగిన టర్కీ 1926లోనే స్విస్‌ పౌరస్మృతిని అంగీకరించింది. కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాల్లో మత చట్టాల ప్రమేయాన్ని ఇది నిషేధిస్తుంది. దాని ప్రకారం ట్రిపుల్ తలాక్‌ విధానమూ రద్దయిపోయింది.
6) ఇరాన్‌: ట్రిపుల్ తలాక్‌ విధానానికి దాదాపు 87 శాతం ముస్లిం జనాభా ఉన్న ఇరాన్‌లో 1992లోనే సవరణలు చేశారు.
7) ట్యూనీషియా: భర్త ఏకపక్షంగా తలాక్‌ చెప్పడం ఈ దేశంలో కుదరదు. మతపెద్దలు, న్యాయమూర్తులకు కారణం చెప్పాల్సి ఉంటుంది. రాజీకి కొంత గడువు ఇచ్చిన తర్వాత, కోర్టు మాత్రమే విడాకులు మంజూరు చేస్తుంది. 1956లో ఇలాంటి సవరణలు చేశారు.
8) అల్జీరియా: ఇక్కడ తలాక్‌ చెప్పడం కుదరదు. కోర్టు మాత్రమే విడాకులు మంజూరుచేస్తుంది.. అదీ రాజీ యత్నాలు చేసిన తర్వాతే! రాజీకి మూడు నెలల సమయం ఇస్తారు.
9) శ్రీలంక: ఈ దేశంలో చేసిన సవరణల ప్రకారం... భర్త ముందుగా బంధువులు, స్థానికుల సమక్షంలో ఖ్వాజీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జంట కలిసి ఉండేలా వారంతా ప్రయత్నిస్తారు. అది కుదరని పక్షంలో 30 రోజుల తర్వాత విడాకులిచ్చేందుకు అవకాశం ఇస్తారు. ఖ్వాజీ, ఇద్దరు సాక్షుల సమక్షంలో ఈ ప్రక్రియను చేపడతారు. కాగా, సౌదీ అరేబియాలో అయితే భర్త మనసులో మూడు సార్లు తలాక్ అని అనుకున్నా సరే ఆ భర్తను వీడాల్సిందే. 

  • Loading...

More Telugu News