: ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి అనారోగ్యం... ఇన్వెస్టర్లతో కీలక సమావేశం వాయిదా!
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సంస్థ ఇన్వెస్టర్లతో తలపెట్టిన కీలక సమావేశం వాయిదా పడింది. నేటి సాయంత్రం ఆయన ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించాల్సి వుండగా, అనుకోకుండా మూర్తి అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో సాయంత్రం 6.30కి సాగాల్సిన సమావేశాన్ని 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. గత కొంతకాలంగా సంస్థలో విలువలు నశించాయని, కావాల్సిన వారికి వేతనాలు పెంచుకుంటూ పోతున్నారని, భవిష్యత్ వ్యూహాల అమలు సక్రమంగా లేదని నారాయణమూర్తి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఆపై జరిగిన పరిణామాలు సంస్థ సీఈఓ విశాల్ సిక్కా రాజీనామాకు దారితీయగా, పరిస్థితిని సర్దేందుకు బై బ్యాక్ ఆఫర్ ప్రకటించినా, ఈక్విటీ విలువ మాత్రం కోలుకోలేకపోయింది. వచ్చే సంవత్సరం మార్చిలోగా కొత్త సీఈఓ ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్న ఇన్ఫోసిస్, యూబీ ప్రవీణ్ రావును తాత్కాలిక సీఈఓగా ప్రకటించిన విషయం విదితమే. కాగా, అనారోగ్యం పాలైన నారాయణమూర్తి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతోనే సమావేశ వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.