: తెలంగాణలో 11 లక్షల ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తి చేసిన అధికారులు
తెలంగాణ రాష్ట్రంలోని 72 పట్టణాలకు సంబంధించి సమగ్ర భూవివరాల పట్టికను సిద్ధం చేశామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఇందులో భాగంగా గూగుల్ మ్యాప్ సాయంతో 11 లక్షల ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. దీని వల్ల రాష్ట్రంలో స్థలాలు కొనుక్కునే మార్గం సుగమమైందని ఆమె అన్నారు. ఎవరైనా ఇల్లు కొనుగోలు చేయాలంటే సీడీఎంఏ వెబ్‌సైట్‌లో నో ప్రాపర్టీ డిటెయిల్స్‌పై క్లిక్ చేసి కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలో ఇంటి నంబర్ లేదా ఆస్తిపన్ను మదింపు క్రమసంఖ్య వివరాలు నమోదు చేస్తే ఆ ఇంటికి సంబంధించిన సమగ్ర వివరాలు తెలుస్తాయన్నారు.
ఇంటి యజమాని ఎవరు? ఆస్తి పన్ను చెల్లించారా? ఆ ఇంటిపై కోర్టు కేసులు పెండింగులో ఉన్నాయా? ఇతరత్రా న్యాయ వివాదాలున్నాయా? వంటి విషయాలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గతంలో ఉన్న 14 పత్రాలకు బదులుగా రెండు పత్రాలు సమర్పించేలా చర్యలు తీసుకున్నామని, ఓటరు గుర్తింపు కార్డు లేదా పాన్‌కార్డు, లీజు అగ్రిమెంట్ వంటివి పొందుపరిస్తే రెండువారాల్లో అనుమతి ఇస్తామని శ్రీదేవి తెలియజేశారు. వీటితో పాటు పట్టణ ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా సిటిజన్ బడ్డీ మొబైల్ యాప్‌ను సీడీఎంఏ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పట్టణ ప్రజలు అన్నిరకాల సేవలను పట్టణ స్థానిక సంస్థల నుంచి అందుకోవచ్చు. ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేయవచ్చు. ఆస్తిపన్ను సులువుగా కట్టుకోవచ్చు. ఇందుకోసం ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి పలు ప్రైవేట్ బ్యాంక్‌లతో సీడీఎంఏ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.