: తెలంగాణ మావోయిస్టు సుధాకర్ తలపై రూ. 25 లక్షలు, అతని భార్య నీలిమపై రూ. 10 లక్షల రివార్డు
సుదీర్ఘకాలంగా అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ మావోయిస్టు దంపతులు సుధాకర్ అలియాస్ కిరణ్ అలియాస్ శరద్, నీలిమ అలియాస్ పద్మ అలియాస్ జయలను పట్టిచ్చినా, చంపినా, సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినా భారీ నజరానా ఇస్తామని జార్ఖండ్ ప్రకటించింది. జార్ఖండ్ పోలీసులు ఎంతో కాలంగా గాలిస్తున్న మావో నేతల జాబితాలో 12 పేర్లుండగా, వీరిద్దరే అగ్రస్థానంలో ఉన్నారు. ఇక సుధాకర్ తలపై రూ. 25 లక్షలు, నీలిమ తలపై రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని జార్ఖండ్ పోలీసులు గోడ పత్రికలను ప్రచురించారు. ఇప్పటివరకూ 30 మంది అగ్ర నాయకులను అరెస్ట్ చేశామని, పలువురు వయో భారంతో చురుకుగా లేకపోగా, సుధాకర్, నీలిమ విస్తృతంగా పర్యటిస్తూ, క్యాడర్ ను పెంచుకుంటున్న కారణంగానే, వీరిని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇక వీరితో పాటు రవీంద్ర, దీపక్, భూషణ్, బలరామ్, మునేశ్వర్ తదితరుల తలలపై రూ. 10 లక్షల చొప్పున రివార్డును పెంచినట్టు పోలీసు అధికారులు తెలిపారు.