: వారంలో చలామణిలోకి రూ. 200 నోటు, ఆపై రూ. 50 నోట్లు!
ఇండియాలో రూ. 1000 నోట్ల రద్దు తరువాత ఏర్పడిన చిల్లర కొరతను తీర్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించి సిద్ధం చేసిన సరికొత్త రూ. 200 నోట్లు మరో వారంలో చలామణిలోకి రానున్నాయి. ఈ కరెన్సీని నెలాఖరులోగా లేకుంటే సెప్టెంబర్ మొదటి వారంలో బ్యాంకులకు అందిస్తామని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. ఆపై బ్లాక్ మార్కెటింగ్ జరుగకుండా అన్ని చర్యలూ తీసుకుని రూ. 50 కొత్త కరెన్సీని కూడా విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇండియాలో ఇప్పటివరకూ రూ. 100, రూ. 500 మధ్య ఎలాంటి ఇతర డినామినేషన్ నోట్లూ లేవన్న సంగతి తెలిసిందే.
కొత్త కరెన్సీ విడుదల తేదీలను కచ్చితంగా వెల్లడించక పోయినా, ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యలను ఇవి తీరుస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్ అంచనా వేశారు. తొలిసారిగా ఆర్బీఐ రూ. 2000 నోట్లను మార్కెట్లోకి విడుదల చేసిన వేళ, బ్లాక్ మార్కెటింగ్ జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కరెన్సీ విడుదల సమయంలో అవే తరహా పొరపాట్లు జరగకుండా చూడాలన్నది ఆర్బీఐ అభిమతంగా తెలుస్తోంది.