: కాసేపట్లో నంద్యాల పోరు ప్రారంభం... సర్వం సిద్ధం.. పోలింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలు, సిబ్బంది.. భారీ భద్రత!
కాసేపట్లో నంద్యాల ఉప ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా పోలీసులు బాడీ ఓర్మ్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వాటితో పాటు మూడు డ్రోన్ కెమెరాలను కూడా వాడుతున్నారు.
మొత్తం 2,500 మంది భద్రతా సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు. మండల స్థాయిలో ఎస్పీలను భద్రతా పర్యవేక్షణకు సిద్ధం చేశారు. అలాగే రక్షక్ వాహనాలతో అదనపు సిబ్బంది భద్రత కల్పించనున్నారు. మరోపక్క, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. అలాగే ఈవీఎంలలో వీసాపాట్ మిషన్లు అమర్చారు. వాటి ద్వారా ఓటేసిన ఏడు సెకన్లపాటు ఎవరికి ఓటేశామో చూసుకునే వెసులుబాటు కల్పించారు.
నంద్యాల ఉపఎన్నికల్లో మొత్తం 2,19,108 మంది ఓటర్లు వున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 255 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 800 మంది నుంచి 1000 మంది ఓటేయనున్నారు. ఈ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, అధికార పార్టీకి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి, ప్రతిపక్షానికి చెందిన శిల్పా మోహన్ రెడ్డి మధ్య రసవత్తర పోరు ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలతో చేరుకున్నారు. మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది.