: మేము భయపడే రకం కాదు..ఎలాంటి ఒత్తిళ్లకు లొంగం: శిల్పామోహన్ రెడ్డి తనయుడు రవిచంద్ర కిశోర్
తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడటం లేదని, తాము భయపడే రకం కాదని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవిచంద్రకిశోర్ రెడ్డి అన్నారు. ఈ రోజు రాత్రి తమ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసులను తమ ఇంటికి పంపాల్సిన అవసరం లేదని, అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు పనిచేస్తున్నట్టు కనబడుతోందని ఆరోపించారు. ఈ రోజు ఉదయం నుంచి తమ సేవా సంస్థలను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారని, మూడు, నాలుగు సార్లు వచ్చి వాటిని మూసివేయాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు.
అయితే, పోలీసుల ఒత్తిళ్లకు తాము లొంగలేదని, నిబంధనలను ఉల్లంఘిస్తే తమపై చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న టీడీపీ నాయకులను పోలీసులు పట్టించుకోవడం లేదని, మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నంద్యాలలోనే ఉన్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఓటర్లకు డబ్బులు, చీరలు, ముక్కుపుడకలు పంచిన టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్ పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ప్రేక్షకపాత్ర పోషించారని రవిచంద్ర కిశోర్ రెడ్డి ఆరోపించారు.