: బుద్వేల్ లో రెడ్డి హాస్టల్ భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్


రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లో రాజా బహదూర్ వెంట్రామిరెడ్డి హాస్టల్ భవన సముదాయానికి సీఎం కేసీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, ఈ రోజు ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ మహనీయుల పేర్లు కనుమరుగైపోయాయని, రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పేరు ప్రస్తావనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే పోలీస్ అకాడమీ ‘అప్పా’కు ఆయన పేరు పెట్టుకున్నామని అన్నారు. వెంకట్రామిరెడ్డి పోలీసు కొత్వాల్ గా పని చేశారు కాబట్టే, ‘అప్పా’కు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. పేద పిల్లల చదువు కోసం, వారి అభివృద్ధి కోసం ఎంతో పాటు పడిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. నాడు రెడ్డి హాస్టల్ లో ఇతర కులాల విద్యార్థులకు కూడా అవకాశం కల్పించిన మహనీయుడు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి అని కొనియాడారు.

రెడ్డి హాస్టల్ కు ఇప్పటికే ఇచ్చిన పది ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు కేటాయిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ నారాయణగూడలో బాలికల హాస్టల్ కు అదనంగా మరో 1500 గజాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బుద్వేల్ లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో రాజా బహదూర్ పేరుతో భారీ ఎడ్యుకేషన్ టవర్ ను నిర్మించి క్యాంపస్ రిక్రూట్ మెంట్లు జరిగేలా చూడాలని అన్నారు. దేశంలోనే అత్యున్నత సంస్థగా దీనిని తీర్చిదిద్దాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News