: మర్యాదగా చెబుతున్నా... బెల్టుషాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయి: చంద్రబాబు
ఇసుక విధానం, లిక్కర్ విధానంలో కొన్ని సమస్యలు ఇప్పటికీ ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను మర్యాదగా చెబుతున్నానని, నోటిఫై చేసిన ప్రదేశాల్లో కాకుండా విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ బెల్టుషాపులు పెడితే ఊరుకోబోమని తెలిపారు. మహిళలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 1100 నెంబర్‌కి ఫోన్ చేసి చెప్పవచ్చని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికారులు చూడాలని అన్నారు.
తాము ప్రజలతో అనునిత్యం అనుసంధానం అవుతున్నామని చంద్రబాబు చెప్పారు. తాము పరిపాలనలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికడతామని పేర్కొన్నారు. ఇసుక ధరలను సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని చెప్పారు. ఇసుక విధానంపై కొత్త మార్గదర్శకాలు ప్రకటించామని తెలిపారు. ఎవరైనా ఇసుక దందా చేస్తే సహించబోమని అన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇసుక, మద్యం విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో సీసీటీవీలు, చెక్‌పోస్టులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.