: సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్ పై సంచలన తీర్పు ఇవ్వడానికి ఈ ఐదుగురు మహిళలే కారణం!
మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చేసి మరో మహిళను పెళ్లి చేసుకోవచ్చనే ముస్లింలలో ఉన్న పద్ధతిని రద్దు చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ, చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ట్రిపుల్ తలాక్ పై ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి, సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ముస్లిం మహిళలు లాభపడడానికి ప్రధానంగా ఐదుగురు ముస్లిం మహిళలే కారణం. వారి గురించి తెలుసుకుందాం..
షయారో బానో (36): తనలాంటి మహిళల జీవితాలను నాశనం చేస్తోన్న ట్రిపుల్ తలాక్‌పై మొట్టమొదట గళం విప్పింది షయారో బానో అనే ముస్లిం మహిళ. ఈమె ఉత్తరాఖండ్ కాషిపూర్‌లోని హేమపూర్ దయాకు చెందిన మహిళ. షయారో బానో ఎంఏ సోషియాలజీ చదువుకుంది. అనంతరం పెళ్లి చేసుకున్న ఈమె 2015 అక్టోబర్‌లో తన పుట్టింటికి వచ్చింది. ఆమెకు ఇర్ఫాన్ (13), ముస్కాన్ (11) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె భర్త రిజ్వాన్ అహ్మద్ అక్టోబర్ 15, 2015న ఆమెకు ఓ లెటర్ లో తలాక్ తలాక్ తలాక్ అని రాసి పంపి, విడాకులు ఇచ్చాడు. అనంతరం భర్తకు దూరమైన షయారో బానో ఫిబ్రవరి 23, 2016న ట్రిపుల్ తలాక్‌కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా వచ్చిన తీర్పుపై ఆమె స్పందించి హర్షం వ్యక్తం చేసింది. 'దేశానికే ఈ రోజు చారిత్రక దినం' అని ఆమె మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించింది.
గుల్షాన్ పర్వీన్ (30): ఈ ముస్లిం మహిళ ఉత్తర ప్రదేశ్‌లోని రామ్ పూర్ వాసి. ఆమె 2015లో తన పుట్టింట్లో ఉండగా, ఆమె భర్త ఆమెకు ఓ 10 రూపాయల స్టాంప్ పేపర్ అంటించిన ఓ లెటర్ పై తలాక్ తలాక్ తలాక్ అని రాసి పంపించాడు. దీంతో విస్మయం వ్యక్తం చేసిన ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనకు ఏప్రిల్, 2013లో వివాహం జరిగిందని, తనను తన అత్తింటివారు కట్నం కోసం కూడా వేధించేవారని ఫిర్యాదు చేసింది.
ఆఫ్రీన్ రెహ్మాన్ (28): జైపూర్ వాసి అయిన ఈమె ఎంబీఏ వరకు చదువుకుంది. ఏ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా 2014లో ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లయిన కొన్ని రోజుల నుంచి కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తుండడంతో ఆమె తిరిగి తన పుట్టింటికి వెళ్లింది. జనవరి 2016న ఆమెకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అనంతరం న్యాయ పోరాటం చేసి ఈ రోజు విజయం సాధించింది. సుప్రీంకోర్టు తీర్పు తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొంది.
ఇష్రాట్ జాహన్ (31): ఈమె పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళ. ఏప్రిల్ 2015లో ఆమె భర్త దుబాయ్ నుంచి ఆమెకు ఫోన్ చేసి తలాక్ చెప్పాడు. అనంతరం భర్త తీరుకి నిరసనగా న్యాయపోరాటం చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు తనలాంటి మహిళకు అన్యాయం జరగకుండా మంచి తీర్పు ఇచ్చిందని ఆమె హర్షం వ్యక్తం చేసింది.
ఆటియా సబ్రి: ఈమె ఉత్తరప్రదేశ్‌లోని సహ్రన్‌పూర్ వాసి. ఈ కేసులో ఈమే చివరి పిటిషనర్. ఈమెకు వాజీద్ అలీతో 2012లో పెళ్లి జరిగింది. నవంబర్, 2015లో ఆయన ఒక పేపర్ పై ట్రిపుల్ తలాక్ అని రాసి పంపి, విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె న్యాయ పోరాటం చేసింది.