: టాల్కం పౌడర్ వల్ల కేన్సర్: ‘జాన్సన్ & జాన్సన్’కు భారీ జరిమానా!
అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ జాన్సన్ & జాన్సన్ కు భారీ జరిమానా విధిస్తూ లాస్ ఏంజిల్స్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఈ సంస్థకు చెందిన బేబీ టాల్కమ్ పౌడర్ వాడడం వల్లే ఈవా ఎచివెరియా అనే మహిళకు అండాశయ క్యాన్సర్ సోకిందని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితురాలు ఎచివెరియాకు 417 మిలియన్ల డాలర్లు.. మన కరెన్సీలో రూ.2700 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది.
కాగా, టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల తలెత్తే కేన్సర్ ఇబ్బందుల గురించి సదరు సంస్థ తమ ఉత్పత్తులపై హెచ్చరికలు జారీ చేయలేదని బాధితురాలు ఎచివెరియా ఆరోపించింది. చాలా ఏళ్ల పాటు ఈ పౌడర్ ను తాను వినియోగించానని, 2007లో తనకు అండాశయ కేన్సర్ వచ్చినట్టు వైద్యులు గుర్తించారని ఎచివెరియా తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ పౌడర్ వాడటం వల్లే తన క్లయింట్ ఈ వ్యాధి బారిన పడిందని, ఇటువంటి నష్టం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతోనే కోర్టు కెక్కామని ఎచివెరియా తరపు న్యాయవాది మార్క్ రాబిన్ సన్ చెప్పారు.
నష్టం కింద 68 మిలియన్ల డాలర్లు, శిక్ష పరిహారం కింద 340 మిలియన్ల డాలర్లు చెల్లించాలని జాన్సన్ & జాన్సన్ కంపెనీని కోర్టు ఆదేశించిందని చెప్పారు. కాగా, ఈ విషయమై ‘జాన్సన్ & జాన్సన్’ ప్రతినిధి కరోల్ గూడ్రిచ్ స్పందిస్తూ.. జ్యూరీ నిర్ణయంపై అప్పీల్ చేస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు.