: అబ్బాయిగా మారిన అమ్మాయి... అమ్మాయిగా మారిన అబ్బాయి... వాళ్లిద్దరి విచిత్ర వివాహం!
కేరళకు చెందిన 46 ఏళ్ల ఆరవ్ అప్పుకుట్టన్ అమ్మాయిగా జన్మించాడు. తర్వాత ముంబైలోని ఓ హాస్పటల్‌లో సర్జరీ చేయించుకుని అబ్బాయిగా మారాడు. అదేవిధంగా 22 ఏళ్ల సుకన్య కూడా పుట్టుకతో అబ్బాయి, అదే ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారింది. ఒకరోజు ఇద్దరూ ఆసుపత్రిలో అనుకోకుండా కలుసుకున్నారు. ఇద్దరూ మలయాళీలు కావడంతో మాటామాటా కలిసింది. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. అలా ఫోన్లో సందేశాలు మారుతున్న క్రమంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు.
తమకు ఇష్టం లేని లింగత్వాన్ని భరిస్తూ తాము చిన్నతనంలో పడిన బాధే తమ మనసులు కలిసేలా చేసిందని ఆరవ్ అంటున్నాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట తమ పెళ్లి తంతును సింపుల్‌గా కానిచ్చేద్దామనుకుంటున్నారు. కానీ వారి స్నేహితులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని, వీలైనంత వైభవంగా మీ పెళ్లి చేసుకోండని వారు సలహా ఇస్తున్నట్లు సుకన్య తెలిపింది. వీరిద్దరికీ సర్జరీ చేసిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్యుడు, డాక్టర్ సంజయ్ పాండే కూడా వీరు పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య రాదని తెలియజేశారు. పెళ్లైన తర్వాత చిన్నతనంలో తమలాగే కష్టాలు పడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇస్తామని ఆరవ్, సుకన్యలు పేర్కొన్నారు.