: నంద్యాల ప్రజలకు శిల్పా బంపరాఫర్... పోలీసుల రంగ ప్రవేశం!
నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న శిల్పా సహకార మార్కెట్ లో తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు ఇస్తామని చేసిన ప్రకటనతో వందలాది మంది అక్కడ గుమికూడగా, ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి స్టోర్ కు బలవంతంగా తాళాలు వేయించారు. ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు సహకార మార్కెట్ లో తక్కువ ధరలకు సరుకులు పొందవచ్చని ప్రచారం చేయగా, నేడు పలువురు నంద్యాలవాసులు అక్కడికి చేరుకున్నారు.
పెద్దఎత్తున సరుకులను తక్కువ ధరలకు ఇస్తూ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో, తనిఖీలు చేసిన ఎన్నికల అధికారులు, ఆ ఆరోపణలు నిజమని తేల్చి, సిబ్బందిని బయటకు పంపించి, స్టోర్ ను మూసివేయించారు. కాగా, తెలుగుదేశం నేతలు నంద్యాలలోనే మకాం వేసి, వార్డుల వారీగా మద్యం, డబ్బు పంచుతున్నారని, వారు ఓ రెస్టారెంట్ లో రహస్యంగా సమావేశమైతే, పోలీసులు ఆ వైపుకు కూడా వెళ్లడం లేదని వైకాపా స్థానిక నేతలు ఆరోపించారు.