: మైనారిటీలో పడ్డ తమిళ సర్కారు... రంగంలోకి దిగిన స్టాలిన్!
తమిళనాట పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఒకటై 24 గంటలు కూడా గడవకుండానే, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తాము పళని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఈ ఉదయం గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి విన్నవించగానే, పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు డీఎంకే నేత స్టాలిన్ రంగంలోకి దిగారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.
దినకరన్ కు చెందిన 19 మందితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో, ఇప్పటికిప్పుడు బల ప్రదర్శన జరిగితే ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఇక దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలసి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, పళనిస్వామిపై తమకు నమ్మకం లేదని, వెంటనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్ ను కోరామని శశికళ వర్గం నేత థంగ తమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు.