: సాఫ్ట్ వేర్ భర్త శాడిజానికి పరాకాష్ఠ... అరటికాయ పడేయలేదని మెడపై కాలేసి తొక్కేశాడు!


కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మోహన్‌ శంకర్‌ రావు, హేమలత దంపతులు తమ కుమార్తె పుష్పశ్రీ (26)ని బీటెక్‌ వరకు చదివించారు. 2012లో విజయవాడ ఆటోనగర్‌ కు చెందిన బ్రహ్మేశ్వరరావుతో ఘనంగా వివాహం జరిపించారు. వివాహానంతరం ఆరు నెలలు పుష్పశ్రీ అత్తవారింట్లో ఉంది. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఈ ఆరు నెలలపాటు ఆమె నరకం చూసింది. ఆమె మామ అయితే... 'పుష్పశ్రీ ఈ రోజు కిటికీ సరిగా తుడవలేదు, వంటపాత్రలు సరిగా కడగలేదు' అంటూ తేదీలు, సమయం, వారంతో సహా పుస్తకం మెయింటైన్ చేసేవాడు.

ఆ తరువాత పుష్పశ్రీని ఆమె భర్త అమెరికాకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ అక్కడ రెండేళ్లున్నారు. ఈ రెండేళ్లలో ఆమెను కొట్టని రోజు లేదంటే అతిశయోక్తి కాదని ఆమె బంధువులు చెబుతున్నారు. పుష్పశ్రీని బ్రహ్మేశ్వరావు ఎందుకు కొట్టాడు? అని నిలదీస్తే... ఆమె మామ తాను రాసిన ఆమె తప్పులకు సంబంధించిన పుస్తకం వారి ముందు పెట్టేవాడని తెలిపారు. రెండేళ్ల తరువాత స్వదేశం చేరి, హైదరాబాదులోని టీసీఎస్ లో చేరిన బ్రహ్మేశ్వరరావు, మియాపూర్‌ లోని ఫ్రెండ్స్‌ కాలనీ ప్రియాంక రెసిడెన్సీలో నివసిస్తూ వేధింపులకు దిగాడు. భర్త శాడిజంతో మానసిక ఒత్తిడిలో ఉన్న పుష్పశ్రీకి పిల్లలు పుట్టకపోవడం మరోపెద్ద సమస్యగా మారింది.

ఈ క్రమంలో ఈ నెల 16న అరటికాయ బయట పడేయలేదని ప్లేటుతో ముఖంపై కొట్టాడని, స్పృహ తప్పి పడిపోతే పట్టించుకోకుండా వెళ్లిపోయాడని, ఆ తరువాత మళ్లీ వచ్చి పిడిగుద్దులు గుద్ది, మెడపై కాలేసి తొక్కి చంపాలని చూశాడని, చచ్చిపోయిందని భావించి, బయటకు ఈడ్చేసి పారిపోయాడని బంధువులు, బాధితురాలు తెలిపింది. ఈ ఐదేళ్ల సమస్యలు చెబితే అనారోగ్యంతో బాధపడే తన తండ్రి మరింత అనారోగ్యానికి గురవుతారని, కుటుంబసభ్యులు బాధపడతారనే భయంతో చెప్పలేదని ఆమె తెలిపింది. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. బ్రహ్మేశ్వరరావు పరారీలో ఉన్నాడని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News